ఒకప్పుడు 'జగన్మోహిని'గా తెలుగు, తమిళ చిత్రసీమల్ని ఏలేసింది జయమాలిని. క్లబ్ సాంగ్స్‌కు, ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బొద్దుగా ఉంటూనే అందచందాలు, నాట్యవిలాసాలతో ప్రేక్షకులను దాసోహం చేసుకుందామె. ఆ రోజుల్లో జయమాలినిని ఆరాధించని రసిక జనం లేరంటే అతిశయోక్తి కాదు. కురుచ దుస్తుల్లో, వంటి ఒంపులను ప్రదర్శిస్తూ కెమెరా ముందు డాన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ అనిపించదా? అనే సందేహం చాలా మందికి వస్తుంది. దానికి జయమాలిని దగ్గర సమాధానం ఉంది.
ఆమె శృంగార నృత్యతారగా పీక్ స్టేజ్‌లో ఉండగా ఒకసారి, "జయమాలిని గారూ! మీరు మంచి నటి, నర్తకి అయివుండి కూడా కేవలం క్లబ్ డాన్సర్ గానే స్థిరపడిపోయారు. కానీ ఆ క్లబ్ శృంగారం ఈ మధ్య మరీ మోతాడు మీరిపోతోంది. మీ డాన్సుకి కెమెరా కూడా మరింత చురుగ్గా దోహదం చేస్తోంది. ఇది మగ ప్రేక్షకుల చేత ఈలలు వేయించవచ్చుగాని, స్త్రీలకు మాత్రం ఇబ్బందిగానే ఉంటోంది. అలాంటి నాట్యాలు చేస్తున్నప్పుడు ఒక స్త్రీగా మీకు ఇబ్బంది ఉండదా? మీ నృత్యాలకు విమర్శలను ఎదుర్కొంటున్నారా? అలాంటి నాట్యాలు చేస్తున్నందుకు మీరెప్పుడైనా ఫీలయ్యారా?" అని ఒక ప్రేక్షకురాలు ప్రశ్నించింది.
"మీ బాధ నాకు అర్థమైందమ్మా. నేను చిత్రాల్లో నటించాలనే వచ్చాను, నటించాను కూడా. కానీ, అలాంటి డాన్సులు చెయ్యడంతోనూ, అవి రాణించడంతోనూ నన్ను ఒక డాన్సర్‌గానే ముద్రవేశారు. అలాంటి డాన్సులు ఆడినప్పుడు కెమెరా కూడా అలాగే పనిచెయ్యాలి. డాన్స్ డైరెక్టర్లు కూడా అలాంటి మూవ్మెంట్స్నే కంపోజ్ చెయ్యాలి. మీరు చెప్పినట్టు, ఆ డాన్సులు మగప్రేక్షకుల చేత ఈలలు వేయించడానికే! స్త్రీలకు ఇబ్బందే కావచ్చు, కానీ అందుకు నేను బాధ్యురాలిని కాను. ఇలాంటి నృత్యాలకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలను అనసరించి, దర్శక నిర్మాతలు అలాంటి నృత్యాలు పెట్టడం ఆపేయాలి కదా. కానీ, ఒక్కోసారి ఇలాంటి నృత్యాలే బాక్సాఫీస్‌కు కారణమవుతున్నాయి. అంచేత తప్పడం లేదు! అలాంటి నాట్యాలు చేస్తున్నందుకు నేనెప్పుడూ ఫీల్ కాలేదు. ఎంచేత? ఫీలైతే, మళ్లీ చేసి ఉండనుగా." అని చెప్పుకొచ్చింది జయమాలిని.